సూర్యాపేట, వెలుగు: కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ లీడర్లు డిమాండ్ చేస్తూ సోమవారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించి కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వెంపటి గురూజీ మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని, అదనపు పనిభారంగా మారిన బీఎల్వో డ్యూటీల నుంచి మినహాయించాలని, పర్మినెంట్ చేయడంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు, కల్యాణలక్ష్మి వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
ఈ ఆందోళన సందర్భంగా గేటు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీడబ్ల్యూవో నర్సింహారావు జోక్యంతో నాయకులు కలెక్టర్‌ను ప్రజావాణిలో కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ జిల్లా పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తామని, వేతనాల పెంపు వంటి ప్రధాన డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యునియన్ జిల్లా అధ్యక్షురాలు తాటిపాముల నాగలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్ తంతెనపల్లి సుజాత, నాయకులు పాల్గొన్నారు.
